జగన్ పై దాడి కేసులో ముగిసిన ఎన్ఐఏ విచారణ

జగన్ పై దాడి కేసులో ముగిసిన ఎన్ఐఏ విచారణ

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ ముగిసింది. ఈనెల 12న నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఐ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. శని, ఆదివారాల్లో అతన్ని విశాఖలో విచారించారు. రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకువచ్చారు. సోమవారం నుంచి న్యాయవాదుల సమక్షంలో విచారించారు. తిరిగి రేపు ఉదయం విశాఖ కోర్టులో శ్రీనివాసరావును హజరుపరచనున్నారు. సంచలనం కోసమే జగన్‌పై దాడి చేశానని విచారణలో నిందితుడు చెప్పినట్లు సమాచారం. గత ఐదు రోజులుగా తమ కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రావును విచారించింది.
 
డీఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ ఐదు రోజుల విచారణలో శ్రీనివాసరావు ఒక విషయం చెప్పాడు. కేవలం సంచలనం కోసమే జగన్‌పై దాడి చేశానని, తన వెనుక ఎవరూ లేరని, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పడంతో అధికారులు బుధవారం రాత్రితో విచారణ ముగించారు. 7 రోజులు కస్టడీకి తీసుకున్నప్పటికీ 5రోజులతో విచారణ ముగించారు. కోర్టు నిబంధనల ప్రకారం నిందితుడు శ్రీనివాసరావుకు ప్రతీ 48 గంటలకు ఓసారి వైద్యపరీక్షలు నిర్వహించాలి. దీంతో తమ కస్టడీలో ఉన్న శ్రీనివాసరావును 48 గంటలకోసారి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. జగన్ పై దాడి కేసు రాజకీయ పరంగానూ కీలకంగా మారడంతో ఎన్ఐఏ అధికారులు నిర్వహిస్తున్న విచారణ మొత్తాన్ని ఆడియో రికార్డు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఒకరు, ముంబై నుంచి మరొకరు చొప్పున ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చారు.