సిమెంట్‌ కంపెనీలపై మోడీకి ఫిర్యాదు

సిమెంట్‌ కంపెనీలపై మోడీకి ఫిర్యాదు

మార్కెట్‌లో సిమెంట్‌ కంపెనీలు కూటమిగా ఏర్పడి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని నిర్మాణ రంగ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిమెంట్‌ కంపెనీలు ఇష్టారాజ్యం ధరలు పెంచేస్తున్నాయని ఇవి కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నపుడు.. తగ్గినట్లే కన్పించిన సిమెంట్‌ కంపెనీలు మళ్లీ తమ పాత పద్ధతినే పాటిస్తున్నాయని రోడ్డు నిర్మాణ కంపెనీలు, బిల్డర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో సిమెంట్‌ ధరలు అనూహ్యంగా పెరిగుతున్నాయి. సిమెంట్‌ కంపెనీలు లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుని.. మార్కెట్‌ను పంచుకున్నాయని... దీంతో మార్కెట్‌లో పోటీ లేకుండా కుట్ర చేశాయని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. సిమెంట్‌ బస్తా ధర ఉత్తర భారత్‌లో రూ. 25 వరకు పెంచారని.. దక్షిణాదిలో కొన్ని చోట్ల రూ. 100 వరకు పెంచినట్లు వీరు ఆరోపిస్తున్నారు. పైగా బ్లాక్‌లో కూడా సిమెంట్‌ను అమ్ముతున్నాయని వీరు అంటున్నారు. సిమెంట్‌ కంపెనీల తీరు తాము ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టంగా ఉందని వీరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వీరు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకే సిమెంట్‌ కంపెనీలపై ఫిర్యాదు చేశాయి. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రంగంలోకి దిగారు. త్వరలోనే ఆయన సిమెంట్‌ కంపెనీలతో చర్చలు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి.