ఈవీఎం ట్యాంపరింగ్, భద్రతపై ప్రణబ్ ఆందోళన

ఈవీఎం ట్యాంపరింగ్, భద్రతపై ప్రణబ్ ఆందోళన

ఎన్నికల సంఘం బాగా పని చేసిందని ప్రశంసించి కొన్ని గంటలైనా కాకుండానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్, భద్రతపై వార్తలు వెల్లువెత్తుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంలో భద్రపరిచిన పవిత్రమైన ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పును యధాతథంగా వెలువరించే వరకు పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని ఆయన వ్యాఖ్యానించారు. కమిషన్ నిబద్ధతపై ప్రజలకు అనుమానాలు కలగకుండా చూడాలని ఈసీకి ఆయన సూచించారు.

మొదటి ఎన్నికల కమిషనర్ నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషనర్లంతా బాగా పని చేశారని..అయితే ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీఎంల రక్షణ, భద్రత బాధ్యత ఎన్నికల సంఘమే వహించాలని చెప్పారు. ప్రజాస్వామ్య మూలాలను ప్రశ్నించే విధంగా వార్తలు రావడం సరికాదన్నారు. ప్రజల తీర్పు చాలా ఉన్నతమైందని చెప్పారు. అన్ని అనుమానాలకు అతీతంగా ఈ తీర్పు ఉంచాలని కోరారు. దేశ వ్యవస్థలపై తనకు దృఢమైన విశ్వాసం ఉందని.. వీటి సమగ్రత బాధ్యత ఈసీపై ఆధారపడి ఉందని తెలిపారు. అందువల్ల ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చేయాలని సూచించారు.