ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఓటేశారు

ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఓటేశారు

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని అన్నారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అప్పగించినందుకు ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల, మహాపురుషుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మోడీ స్పష్టం చేశారు.  నూతన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమర్థవంతంగా సభను నడుపుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష సభ్యులు చేసిన సలహాలను స్వీకరిస్తామని ప్రకటించారు. సభలో మోడీ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ.. ప్రధానికి పూర్తి సంఘీభావం తెలిపారు.

'ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి.. ఐదేళ్లలో తాము అందించిన పరిపాలనకు ఫలితాలు అద్దం పట్టాయి. ఓటు వేసే ముందు ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించి వేశారు. తమపై భరోసా ఉంచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుంది.. అధికారంలో ఉన్నపుడు వారికోసం ఏం చేశామనే ఆలోచిస్తాం.  మహా పురుషుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. స్పీకర్‌ కొత్తగా వచ్చిన సభ్యులకు కూడా అవకాశమిచ్చారు.. వారు సైతం చక్కగా మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాం. దేశానికి సేవచేసేందుకు అనేక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నాం, దేశ ప్రగతి కోసం అనేక విధాలుగా ఆలోచిస్తున్నాం. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ప్రతి పౌరుడు తన హక్కుల కోసం పోరాడాలి. మా ప్రభుత్వం పేదవారందరికీ అంకితమని 2014లోనే స్పష్టం చేశాం. వారికిచ్చి అనేక హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం' అని అన్నారు.