కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య కుదిరిన సీట్ల పంపకాలు

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య కుదిరిన సీట్ల పంపకాలు

కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకొంది. బుధవారం కాంగ్రెస్, హెచ్ డి దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ సెక్యులర్ (జెడిఎస్)లు సీట్ల పంపకంపై ఓ అంగీకారానికి వచ్చాయి. రాష్ట్రంలోని 28 సీట్లలో 20-8 సీట్లు పంచుకోవాలని రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది.

కాంగ్రెస్ 20, జెడిఎస్ 8 స్థానాలలో పోటీ చేస్తాయి. అయితే ప్రాంతీయ పార్టీ తనకు బలమైన స్థానాలను ఎంచుకోవడంలో విజయం సాధించింది. ఆ పార్టీకి ఉత్తర కన్నడ, చిక్కమగుళూరు, షిమోగా, టుంకూర్, హసన్, మాండ్యా, ఉత్తర బెంగుళూరు, విజయపురా సీట్లు వదిలేశారు.

కర్ణాటకలో లోక్ సభ స్థానాలను నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జెడీఎస్ జనరల్ సెక్రటరీ డానిష్ అలీతో కేరళలోని కొచ్చిన్ లో బుధవారం భేటీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం జెడిఎస్ పెద్ద తలకాయ హెచ్ డి దేవెగౌడ రెండు పార్టీల మధ్య ఇంకా సీట్ల పంపకంపై అంగీకారం కుదరలేదని ప్రకటించారు. మార్చి 15న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

మొదట జెడిఎస్ 12 సీట్లు కోరినట్టు తెలిసింది. అయితే తర్వాత దేవెగౌడ పార్టీ సీట్ల సంఖ్యపై పట్టుదలగా లేదని తెలిపారు. 10 సీట్లు ఇచ్చినా సంతోషంగా తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ మాత్రం జెడిఎస్ కు 6 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వరాదని భావించింది. చివరకు 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.