అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే ఆమరణ దీక్ష..!

అంబేద్కర్ విగ్రహం పెట్టకపోతే ఆమరణ దీక్ష..!

హైదరాబాద్‌ పంజాగుట్టలో ఏర్పాటు చేసిన భారతదేశ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు... అనంతరం ఆ విగ్రహాన్ని డంపింగ్ యార్డ్‌కు తరలించడంపై ప్రజాసంఘాల నాయకులు, దళితులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, విగ్రహం కూల్చిన చోటే వారంలోగా తిరిగి పెట్టకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మా నేతలు స్టేట్‌మెంట్లు మాత్రమే ఇస్తారు.. కార్యాచరణ ఉండదు, ఆందోళన చేసే సమయానికి మాత్రం ఉండరని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ వీఎచ్.. అంబేద్కర్ విగ్రహం కూల్చితే అన్ని పార్టీలు ఆందోళనకు వచ్చారు.. కానీ, మా వాళ్లు మాత్రం రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా... ఆందోళనలు చేయండి అని పీసీసీ పిలుపు నివ్వాలని సూచించిన వీహెచ్.. రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై మాట్లాడాలన్నారు. అంబేద్కర్ విగ్రహం కూల్చిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రభుత్వాన్ని నిలదీసిన వీహెచ్... ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన ఎన్ని విగ్రహాలకు అనుమతులు ఉన్నాయని ప్రశ్నించారు. అంబేడ్కర్ పై బీసీలకు ఉన్నంత ప్రేమ మా పార్టీలోని దళిత నాయకులకు కూడా లేదన్న ఆయన.. గాంధీభవన్‌లో గాంధీ బొమ్మ పక్కనే నా డబ్బులతో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని ప్రకటించారు.