వైఎస్ కంటే ముందే పాదయాత్ర చేశా.. ఇప్పుడు కొత్త వాళ్లు చేస్తున్నారు..!

వైఎస్ కంటే ముందే పాదయాత్ర చేశా.. ఇప్పుడు కొత్త వాళ్లు చేస్తున్నారు..!

తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల పర్వం మొదలువుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభించగా... మరోవైపు.. జగ్గారెడ్డి కూడా పాదయాత్రకు అనుమతి కోరారు. ఇక, త్వరలోనే పార్టీ పెట్టనున్న వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే, పరోక్షంగా రేవంత్ రెడ్డి పాదయాత్రపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్... నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటే ముందే పాదయాత్ర చేశా... ఇప్పుడు పాదయాత్ర అంతా కొత్త వాళ్లు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. 

మరోవైపు.. నిన్న బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు వీహెచ్.. కేసీఆర్ మాటలు వింటుంటే అసహనమో.. అహంకారమో..? అర్థం కాలేదన్న ఆయన.. ఇంకా ఉద్యమ నాయకుడివి అనుకుంటున్నవా..? అని ప్రశ్నించారు. నువ్వు బహిరంగ సభ పెట్టుకోవచ్చు.. కానీ, మాకు అనుమతి ఇయ్యమంటే ఇయ్యవు..? నువ్వే పర్మినెంట్ అనుకోకు... పవర్ ఎవరి అయ్య జాగిరు కాదు అని హెచ్చరించారు. కేసీఆర్ వరాలు చూస్తుంటే... ఉప ఎన్నికలు ఎన్ని వస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుందని అనిపిస్తోందన్న వీహెచ్.. ఢిల్లీ మెడలు వంచుతా అని... నువ్వే మెడలు వంచుకుని వచ్చావు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలపై స్పందించిన వీహెచ్.. మేయర్ బీసీకి ఇచ్చారు.. మరి, డిప్యూటీ మేయర్ మైనార్టీలకు ఇవ్వొచ్చు కదా..? అని ప్రశ్నించారు. అమావాస్య రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కేసీఆర్ పెట్టాడంటే.. ఎంఐఎం, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని తేలిపోయిందంటూ మండిపడ్డారు.