ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు: వీహెచ్

ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు: వీహెచ్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వీహెచ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజలు తన్నే రోజులు వస్తే కానీ మారరన్నారు. నీ కొడుకుని సీఎం చేయి, నీ పడవ మునుగుడు ఖాయం అని పేర్కొన్నారు. 16 ఎంపీలను పెట్టుకొని ఏం పీకావ్.. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఏం పీకుతావ్ అని వీహెచ్ ప్రశ్నించారు. మాకు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టు అంటే.. మీకు ఓటేస్తే పాల సముద్రంలో వేసినట్టా? అని విమర్శించారు. పార్టీ మార్పు.. నాయకత్వం తప్పని అంటే ఎలా?. ఇబ్బంది ఉంటే రాహుల్ గాంధీకి చెప్పాలి. ఆయనకు చెప్పకుండా బయటకు వెళ్లి నాయకత్వం లోపం అని చెప్తే ఎలా? అని నిలదీశారు.

ప్రధాని మోడీ నల్లధనం తీసుకొస్తా అన్నారు. ఐదేళ్లలో నల్లధనం వెనక్కి రాలేదు.. ఉద్యోగాలు రాలేదని వీహెచ్ ఎద్దేవా చేశారు. బ్యాంక్ లను లూటీ చేసిన నీరవ్ మోడీ లాంటి వాళ్ళను మాత్రం దేశం విడిచిపోయేలా చేశారన్నారు. నీరవ్ మోడీ.. మోడీ ప్రభుత్వానికి దొరకలేదు కానీ మీడియాకి దొరికాడు. దేశాన్ని లూటీ చేసిన నీరవ్ ని మోడీ పట్టుకోలేదు.. పట్టుకోలేరన్నారు. సైనికుల త్యాగాలను కూడా మోడీ తన ఖాతాలో వేసుకుంటున్నారని వీహెచ్ అన్నారు.