మూడు నెలల డ్రామాకు తెరపడింది

మూడు నెలల డ్రామాకు తెరపడింది

ఫెడరల్ ఫ్రంట్  పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడిన డ్రామాకు తెరపడిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికిన గులాబీ బాస్.. ఇప్పుడు దిక్కు తోచని స్ధితిలో ఉన్నట్లు టీఆరెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందని ఆరోపించారు. 'మాయమాటలు చెప్పి, రాష్ట్ర విభజన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ఇన్నిరోజులు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో..సారు, కారు, సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట... డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్  వినిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ను బుట్టలో వేసుకున్న విధంగానే,  స్టాలిన్ ను కూడా బురిడీ కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించారు కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదు. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ వంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్ కు ఉంది. అందుకే ఈ గిమ్మిక్కులనుకు తిప్పికొట్టి, స్టాలిన్ తన చాణక్యనీతిని ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి, టీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ కు చెక్ పెట్టారు' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.