కేసీఆర్‌కి సన్మానం చేస్తా!-జగ్గారెడ్డి

కేసీఆర్‌కి సన్మానం చేస్తా!-జగ్గారెడ్డి

ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదన్న జగ్గారెడ్డి... కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని తాను స్వాగతనిస్తున్నానని మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. కాళేశ్వరం పూర్తి అయితే నా నియోజకవర్గంలోని సింగూరు, మంజీరకు నీళ్లు వస్తాయి... మా సంగారెడ్డికి ఉపయోగపడే అత్యంత పురాతన మహబూబ్‌సాగర్ కు కూడా నీళ్లు వస్తాయని... వీటి ద్వారా మా సంగారెడ్డి ప్రజల సాగు, తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. మంచి పని ఎవరు తలపెట్టినా సమర్థించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే... ప్రోజెక్టులు, డ్యాంలు రైతులు, ప్రజల కోసం ఎవరు కట్టినా మంచిదేనన్నారు. తెలంగాణ తొలి డ్యామ్‌ నాగార్జున సాగర్‌ను నెహ్రూ ప్రధానిగా, కాంగ్రెస్ సీఎంలు పూర్తి చేశారని.. శ్రీశైలం కూడా ఇందిరా ప్రధానిగా కాంగ్రెస్ సీఎంలు ఉన్నప్పుడే పూర్తి చేశారని గుర్తు చేసిన జగ్గారెడ్డి. మా సింగూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మించారు.. నాడు కాంగ్రెస్ సీఎంలు కట్టినా.. నేడు సీఎం కేసీఆర్ కట్టినా అన్నీ తెలంగాణ ప్రజలకోసమే అని భావించాలి తప్ప... వాటిని రాజకీయం చేయొద్దని సూచించారు. 

మరోవైపు ఒక రకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఏర్పాటు చేయటం వల్లే కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారని.. ఆ తర్వాతే కాళేశ్వరం కడుతున్నందున అందులోనూ కాంగ్రెస్ భాగస్వామయం ఉందన్నారు జగ్గారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన ఏడాదిలో సింగూరు, మంజీర, మహబూబ్‌సాగర్‌ను నీళ్లతో నింపితే మా సంగారెడ్డి రైతులు, ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కి ఘనంగా సన్మానం చేస్తామని ప్రకటించారు. ఇక, కాళేశ్వరం అవినీతి గురించి నేను మాట్లాడను... అది పీసీసీ చీఫ్ మల్లు భట్టి విక్రమార్క చూసుకుంటారన్న జగ్గారెడ్డి... కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం వచ్చినా తప్పేలేదన్నారు.