నేను చేరితో 90శాతం యువత బీజేపీలోకే..!

నేను చేరితో 90శాతం యువత బీజేపీలోకే..!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమని ఓసారి ప్రకటిస్తారు! ఆ తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని చెప్పుకొస్తారు..! మరోసారి నాకు బీజేపీయే కరెక్ట్ అనిపిస్తుంది అంటారు..! మళ్లీ నేను యూటర్న్ తీసుకోలేదు..! నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటారు. తాజాగా, తాను సరిగ్గా బీజేపీలోనే ఫిట్‌ అవుతానని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లో స్వార్థం, పదవుల కోసం పనిచేసే మనుషులు కొందరు ఉండవచ్చునని, కానీ బీజేపీలో నిస్వార్థంగా దేశం కోసం, ఒక లక్ష్యంతో పని చేస్తారని కీర్తించారు. ఇక, అంతటితో ఆగని రాజగోపాల్ రెడ్డి.. తాను గనుకు బీజేపీలో చేరితే.. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని యువతలో 90 శాతం ఆ పార్టీలో చేరుతుందని సెలవిచ్చారు. 

మరోవైపు కాంగ్రెస్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ.. మునిగిపోయే టైటానిక్‌ లాంటిదని, అది కాలం చెల్లిన పార్టీ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాత.. బేషరతుగానే చేరతానని, ఎటువంటి పదవినీ ఆశించబోనని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. దేశంలో మరో 20 ఏళ్ల పాటు బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందని, రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని జోస్యం చెప్పారు. మొత్తానికి బీజేపీ వాళ్లు నన్ను పిలవడంలేదు.. నేను బీజేపీలోకి వెళ్లడం లేదు.. లాంటి వ్యాఖ్యలు కూడా చేసిన కోటమిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.