కోమటిరెడ్డి వ్యాఖ్యలపై విస్తృత చర్చ..!

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై విస్తృత చర్చ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విస్తృతమైన చర్చే సాగుతోంది. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓ కార్యకర్తతో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఓ కార్యకర్తతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి జరిపిన ఫోన్‌ సంభాషణ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోగా.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. లక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త రాజగోపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసి, పార్టీని వీడడం బాధగా ఉందని చెప్పగా.. ‘కాంగ్రెస్‌ బతకదు. రాహుల్‌ గాంధీయే రాజీనామా చేశారు. ఈ పార్టీ ముసలిది అయిపోయింది. అందరం కలిసి బీజేపీకి పోదాం. అధైర్యపడొద్దు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎంనవుతా’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ సాగుతోంది. కోమటిరెడ్డికి బీజేపీ అధిష్టానం సీఎం పదవిపై ఏమైనా హామీ ఇచ్చిందా? లేక కార్యకర్తల్లో మనోధైర్యాన్ని చెబుతూ తన వెంట తీసుకెళ్లేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. కోమటిరెడ్డిపై చర్యలకు సిద్ధమవుతుందంటున్నారు.