అవినీతికి టీఆర్ఎస్ అండగా నిలిచింది

అవినీతికి టీఆర్ఎస్ అండగా నిలిచింది

అవినీతికి టీఆర్ఎస్ అండగా నిలిచిందని, సిరిసిల్ల నియోజకవర్గంలోని ఓ మున్సిపల్ ఛైర్మన్ కేటీఆర్ చెబితేనే తాను లంచం తీసుకుంటున్నానని ధైర్యంగా చెప్పాడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లేనని విమర్శించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన రూ.వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని జీవన్ రెడ్డి నిలదీశారు. ఏ పార్టీలో గెలిచినా టీఆర్ఎస్ లో చేర్పించుకుంటున్నారని, కేసీఆర్ ఆలోచనా విధానం మారితేనే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని హితవు పలికారు. రాష్ట్రంలో పాలనను తన చెప్పు చేతల్లో పెట్టుకొనేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసలు పాలనపై కేసీఆర్‌కు పట్టు ఉందా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌కే పరిమితమైన వ్యక్తికి పాలన గురించి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధి రాజకీయ పార్టీల బాధ్యత ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.