ఖాతాల్లో రూ.15లక్షలు వేయమని అడగడంలేదు...

ఖాతాల్లో రూ.15లక్షలు వేయమని అడగడంలేదు...

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదు... ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేయమని అడగడంలేదన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు... ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న కేవీపీ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సుప్రీం... మరి పార్లమెంట్‌లో చేసిన చట్టాలకు విలువ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తోందన్న కేవీపీ... రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే ఏపీ ప్రజలు కోరుతున్నారన్న కేవీపీ... బీజేపీ మాటలు నమ్మి ప్రజలు ఆ పార్టీకి, బీజేపీ మిత్రపక్షాలకు ఓటేశారని, అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ తుంగలోతొక్కారని మండిపడ్డారు. నాలుగేళ్లు ప్రజల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు అనగానే కొత్తనాటకం ఆడుతున్నారంటూ ఆరోపించిన కేవీపీ... నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రధాన హామీలు అమలు జరగలేదన్నారు కేవీపీ.