ముందస్తుకు కారణం కాంగ్రెస్ పార్టీయే

ముందస్తుకు కారణం కాంగ్రెస్ పార్టీయే

ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు కారణం కాంగ్రెస్ పార్టీయే అని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ లో మాట్లాడుతూ... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా టీఆర్ఎస్, కేసీఆర్ పరిపాలనను పొగిడారన్నారు. కాంగ్రెస్ వల్ల దేశానికి, రాష్ట్రానికి ఒరిగేది లేదన్నారు. కాంగ్రెస్ కడుపు మండి.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు కారణం కాంగ్రెస్ పార్టీయే అని స్పష్టం చేశారు. అభివృద్ధిని కేసుల పేరుతో అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ముందస్తు ఎన్నికలు అని పేర్కొన్నారు. మధు యాష్కీ హయాంలో నిజామాబాద్ కు తెచ్చిన నిధులెన్ని, ఎంపీ కవిత తెచ్చిన నిధులెన్నో తేల్చుకుందాం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మిషన్ భగీరథ ఓపెన్ టెండర్ ఎవరైనా వేయవచ్చు అని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన నీరు అందించాలని చూస్తే కాంట్రాక్టర్ ఎవరని ప్రశ్నిస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 546 కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లను కట్టించిన ఘనత మాది. డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదలకు కట్టించి తిరుతాం అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లలో పేదల నుంచి డబ్బులు దండుకున్నారని విమర్శించారు. నిజాo షుగర్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ హయాంలోనే మూత పడింది. టీడీపీ హయాంలో ప్రయివేట్ చేతుల్లో పెట్టారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, సకాలంలో మీరు ప్రాజెక్ట్ లు కట్టి ఉంటే తగ్గేవన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తూ.. పంట సాయం చేస్తూ.. రైతుల ఆత్మహత్యలు తగ్గించాం అని ఆయన పేర్కొన్నారు.

కేటీఆర్ చిన్న వయస్సులో ఐటీ మంత్రిగా పనిచేస్తూ దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటుంటే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎంపీగా కవిత పార్లమెంట్ లో చిన్న వయసులో మంచి పేరు తెచ్చుకున్నారు.. ప్రధాని నరేంద్రమోదీ కూడా తనను మెచ్చుకున్నారని పోచారం తెలిపారు. బీజేపీతో మాకు సంబంధం లేదు, ఎవ్వరితో మాకు పొత్తు అవసరం లేదని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారన్నారు. మేము ప్రజా రుణాన్ని రెట్టింపు చేసుకుంటామన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చి అవాకులు చెవాకులు చెప్తే ప్రజలు ఊరుకోరు అని పోచారం అన్నారు.