ఇదిగో అఫిడవిట్‌.. అలా చేస్తే క్రిమినల్‌ కేసు పెట్టండి..!

ఇదిగో అఫిడవిట్‌.. అలా చేస్తే క్రిమినల్‌ కేసు పెట్టండి..!

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు... తర్వాత కారెక్కారు. అయితే, తాజాగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారంలో కొన్ని చోట్ల ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయట. కాంగ్రెస్‌ నుంచి గెలిచినా... మీరూ టీఆర్ఎస్‌లో చేరిపోతారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్న గ్యారెంటీ ఏంటి? అంటూ ప్రశ్నలు ఎదరుకావడంతో... తాను పార్టీ మారేది లేదంటూ అఫిడవిట్ విడుదల చేశారు... మాజీ ఎంపీ, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని అఫిడవిట్‌ ద్వారా ప్రకటించారు. బాండు ద్వారా తన అఫిడవిట్‌ను విడుదల చేసిన పొన్నం... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరారని, నిన్ను గెలిపించినా అదే పని చేస్తావా? అని కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నించారని.. అందుకే తాను ఈ పని చేసినట్లు వెల్లడించారు. ఒకవేళ పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో తనపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసు కూడా పెట్టవచ్చని, ఈ అఫిడవిట్‌ ప్రతులను లోక్‌సత్తా, అనేక స్వచ్ఛంద సంస్థలకు, ప్రజా సంఘాలకు పంపిస్తున్నట్లు తెలిపారు పొన్నం ప్రభాకర్.