ముందస్తు వస్తుందంటే మరింత సంతోషం...

ముందస్తు వస్తుందంటే మరింత సంతోషం...

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మరింతగా సంతోషపడుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి... ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... ముందస్తుకు వెళ్లిన ప్రతీవారికి ఓటమి తప్పదు... ఇది గత అనుభవం చెబుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వెళ్లినప్పుడు సింహంలా దూకుతుంది... కాంగ్రెస్ పార్టీ తీరు అలానే ఉంటుందన్న జైపాల్... కాంగ్రెస్ జాతీయపార్టీ, కొంతమంది అసంతృప్తివాదులు ఉంటారు... కానీ, యుద్ధంలోకి దిగేటప్పుడు అందరూ ఏకమవుతారని స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి మరింత పెరుగుతోందనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న జైపాల్ రెడ్డి... ప్రధాని నరేంద్ర మోడీతో మితృత్వం దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని... “మిషన్ భగీరథ”లో ఏ గ్రామానికి, ఎవరికీ నీరు రాలేదన్నారు. కేవలం కాంట్రాక్టర్లకు మిషన్‌ భగీరథ నిధులు వచ్చాయని ఆరోపించిన జైపాల్... కాంగ్రెస్ పార్టీయే చెరువులను పునరుద్ధరించిందని వెల్లడించారు. “రైతు బంధు” పధకం గురించి మాట్లడేందుకు టీఆర్ఎస్ నేతలే జంకుతున్నారని విమర్శించిన ఆయన... తప్పులతో రూపొందించిన “పాస్ పుస్తకాల”తో  “రైతు బంధు” పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. ఇక ఎవరు ప్రచారం నిర్వహించాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్న జైపాల్... రాహుల్ సభలు బ్రహ్మాండంగా విజయవంతం అయ్యాయని... తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ  అని ఇప్పుడు తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా తెలిసిందన్నారు. కేసీఆర్ హామీలు ఇచ్చి విస్మరించారు... మాట నిలబెట్టుకోలేని కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు జైపాల్ రెడ్డి.