వేధిస్తున్న వారి జాబితా రెడి అవుతుంది : ఉత్తమ్

వేధిస్తున్న వారి జాబితా రెడి అవుతుంది : ఉత్తమ్

మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో అసలు దోషులు కేసీఆర్, హరీష్ రావులని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఆశ్చర్యపోయేలా.. కొంత మంది పోలీసులు తొత్తులుగా మారారని ఉత్తమ్ అన్నారు. జగ్గారెడ్డి పై 2005వ సంవత్సరంలో కేసు నమోదైతే 2018లో ఎందుకు గుర్తోచ్చిందని ప్రశ్నించారు. డిసెంబర్ రెండో వారంలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న వాళ్ల జాబితా తయారు చేస్తున్నామని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఉత్తమ్ అన్నారు.

వచ్చే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలు. కేసీఆర్ ని తెలంగాణ నుంచి తరిమికొట్టడం చారిత్రక అవకాశం ఉంది. చేరికలతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుంది. బంగారు తెలంగాణ అన్నాడు.. కానీ ఆయన ఫ్యామిలీ బంగారు కుటుంబంగా మారింది. చెప్పిన మాటలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అబద్ధాల కోరు..కేసీఆర్. వాళ్ళు మాట్లాడే ప్రాజెక్ట్ లు కేవలం కాంట్రాక్టర్ల కోసమే తప్పితే ప్రజల కోసం కాదని ఉత్తమ్ తీవ్రస్ధాయిలో విమర్శించారు.

కొండగట్టు ప్రమాదం పై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు పరామర్శించడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ నేత వీ.హనుమంతరావును పంపించామని తెలిపారు. ఈనెల 18న లేదా 19న ఏఐసీసీ నాయకులు గులాంనబీ ఆజాద్ రాష్ట్రానికి రానున్నారని, ఆయన చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పార్టీ నుంచి సహాయం అందచేస్తామన్నారు.