అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ

అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో పాటు, మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేష్‌, కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌  రెడ్డి, దాసోజ్‌ శ్రవణ్‌, బండ్ల గణేశ్‌ తదితరులు 35 అంశాలతో 112 పేజీల కాంగ్రెస్‌ ప్రజా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు దాసోజ్‌ శ్రవణ్‌ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను మీడియాకు తెలిపారు. 

ఉద్యమకారుల అందరిపైనా కేసులు ఎత్తివేత, ఒకే దఫా రూ.2లక్షల రుణమాఫీ అమలు, పంటలకు మద్దతు ధర, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ, నిరుద్యోగులకు రూ.3వేల భృతి, ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని వారసత్వం సంపదగా గుర్తింపు, వ్యవసాయ బడ్జెట్‌, అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలను చెల్లింపు, 100శాతం అక్షరాస్య సాధించే దిశగా అడుగులు, విద్యార్థులందరికీ బోధన రుసుం చెల్లింపు, అన్ని వ్యాధులకు రూ.5లక్షల వరకూ ఆరోగ్యబీమా, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 1000 పడకల వైద్యశాల ఏర్పాటు, సొంత స్థలం ఉంటే రూ.5లక్షలు ఆర్థిక సాయం, అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్. వంటి హామీలను పొందుపర్చింది.