టీఆర్ఎస్ ఓటమి ఖాయం: పొన్నాల

టీఆర్ఎస్ ఓటమి ఖాయం: పొన్నాల

సీపీఎం, టీమాస్ కలిసి ఉన్న బిఎల్ ఎఫ్ కూడా మనతో కలుపుకుంటే టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులు, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య కొన్ని అంశాలను రాహుల్ గాంధీకి సూచించారు.

తెలంగాణాలో పొత్తులకు చాలా ప్రాధాన్యం ఉందని తెలిపారు.1983 నుండి 2014 వరకు కాంగ్రెస్ 1989, 2004, 2009లలో మూడు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 50 శాతం సీట్లు రాకపోవడంపైన దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఓబీసీ, సీమ ఆంధ్రుల విశ్వాసాన్ని చూరగొనడానికి పొత్తులు, కార్యక్రమ ప్రణాలికలను రూపొందించాలని సూచించారు. 1999, 2004, 2009, 2014 లలో పొత్తులు ఉండడం వల్ల, లేకపోవడం వల్ల జరిగిన నష్టాలు బేరీజు వేసుకొని 2019లో ప్లాన్ చేసుకోవాలని రాహుల్ కి సలహా ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పార్టిలో ఎలాంటి రెబల్ అభ్యర్థులు లేకుండా ఓట్లు చీలకుండా ఉండాలి. అందుకు ఒక హై లెవల్ కమిటీ వేయాలని రాహుల్‌ గాంధీకి సూచించారు. టీఆర్ఎస్ పైన, కేసీఆర్ వ్యవహార శైలిపైన, ఆయన కుటుంబంపైన ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని తెలిపారు. మనపైన విశ్వాసం కలిగించాలి.. మన నాయకులు కలుపుకొని పోవడంలేదనే అపవాదు ఉంది దాన్ని అధిగమించాలని వివరించారు. ఎన్నికలకు సంబందించిన కీలక నిర్ణయాలు ఉమ్మడిగా జరగాలి. టీఆర్ఎస్ వైఫల్యాలు, మన మానిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లాలి. ప్రతి ఊరు బేస్ గా ప్రచార కార్యక్రమం చేపట్టాలని రాహుల్ కి పొన్నాల సలహా ఇచ్చారు.