నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు మావే..

నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు మావే..

నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు. నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్, స్థానిక భాస్కర్ టాకీస్ కూడలిలో అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు చెక్కుల వల్లనే కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. కళ్లు నెత్తి మీదకు ఎత్తాయి.. అందుకే అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వర్గంలో మహిళలకు, దళితులకు చోటు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటూ.. ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.