శివుడి అవతారమైతే విషం తాగు.. రాహుల్ కి గుజరాత్ మంత్రి సవాల్

శివుడి అవతారమైతే విషం తాగు.. రాహుల్ కి గుజరాత్ మంత్రి సవాల్

సోమవారం ఓ గుజరాత్ మంత్రికి పురాణేతిహాసాలు గుర్తుకొచ్చాయి. అది సహజంగానే ఓ వివాదాస్పద వ్యాఖ్యకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిజంగానే శివుడి అవతారమైతే విషం తాగి చూపించాలని గుజరాత్ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి గణ్ పత్ వసావా సూరత్ లోని బర్దోలీలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో సవాల్ చేశారు. 500 గ్రాముల విషం సేవించి బతికుంటే రాహుల్ గాంధీ శివుడి పునర్జన్మ అని తామంతా నమ్ముతామని చెప్పారు.

'కాంగ్రెస్ కార్యకర్తలంతా రాహుల్ గాంధీ శివుడి అవతారమని చెబుతుంటారు. ప్రజలను రక్షించేందుకు శివుడు విషం సేవించేవాడు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడితో 500 గ్రాముల విషం సేవింప జేయాలని నేను కోరుతున్నాను' అని వసావా అన్నారు. 'విషం తాగాక కూడా ఆయన శివుడిలా బతికుంటే ఆయన నిజంగా శివుడి పునర్జన్మేనని మేమంతా నమ్ముతాం' అని చెప్పారు.

బీజేపీ మంత్రి శివుడి వెటకారం కాంగ్రెస్ కు మంటెత్తించింది. మంత్రి వ్యాఖ్యలు 'అత్యంత దురదృష్టకరంగా' వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో ఓటమి భయంతో చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయని చెప్పింది.  'మా నాయకుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. ఇది బీజేపీ, దాని నేతల నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లో తమకు ఓటమి ఖాయం అనే భయంతోనే వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని' గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి అన్నారు.

ఫిబ్రవరి 26న బాలాకోట్ వైమానిక దాడులకు రుజువులు చూపించాలన్న కాంగ్రెస్ డిమాండ్ పై కూడా వసావా ఈ నెల ఆరంభంలో ఇలాగే ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా వైమానిక దాడులు జరిపినపుడు రికార్డ్ చేసేందుకు కెమెరా పట్టుకున్న పార్టీ నేతలను ఫైటర్ జెట్ కు కట్టేయాలని వ్యంగ్యంగా అన్నారు.