రాహుల్ ఆదేశిస్తే ఎంపీగా పోటీః కోమటిరెడ్డి

రాహుల్ ఆదేశిస్తే ఎంపీగా పోటీః కోమటిరెడ్డి

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ స్ధానం నుంచి బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా పెద్దసూరారం గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రసంగిస్తూ..నాకు పదవి ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసమే పనిచేస్తానని తెలిపారు. గత ఇరవై సంవత్సరాలు నిజాయితీతో పని చేసినందునే ప్రజలు తనను గుర్తుంచుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల హామీలు ఇంకా అలాగే ఉన్నాయని, ఇప్పుడైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. పెంచిన పెన్షన్లను ఇప్పటి నుంచే అమలు చేయాలని, పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోమటిరెడ్డి అన్నారు.