వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో పేచీలు...?

వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో పేచీలు...?


తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ పేచీలే. ఎన్నికల సమయంలో ఇలాంటివి ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో అదే సీన్‌ కనిపిస్తోంది. ఒకరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు పార్టీ నేతలపై కారాలు మిరియాలు నూరుతున్నారట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.

రాములు నాయక్‌ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో చర్చ!

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ షెడ్యూల్‌ రావడానికి రెండు రోజుల ముందే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డిని.. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్‌ పేర్లను కాంగ్రెస్‌ ఖరారు చేసింది. చిన్నారెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీలో విమర్శలు లేకున్నా..  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై మొదటి నుంచి పార్టీలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన రాములు నాయక్‌.. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పార్టీలో కొంత చర్చ కూడా జరిగింది. అయినా అధిష్ఠానం వాటిని పరిగణనలోకి తీసుకోలేదట. 

పార్టీ ఇంఛార్జులపై బెల్లయ్యనాయక్‌ గుర్రు

రాములు నాయక్‌ గతంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఆయన్ని సస్పెండ్‌ చేసింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు రాములు నాయక్‌. మరి.. నాటి ఘటనలను గుర్తు చేసుకుందో ఏమో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. అయితే అదే సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత బెల్లయ్యనాయక్‌ సైతం ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించారు. ఇప్పుడు పార్టీ టికెట్‌ నిరాకరించడంతో ఆయన గుర్రుగా ఉన్నారట. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, అభ్యర్థుల ఎంపిక కమిటీ ఇంఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై బెల్లయ్య నాయక్‌ మండిపడుతున్నారు. 

టికెట్‌ ఆశించిన వారిని బుజ్జగించలేదా? 

ఈ నియోజకవర్గం పరిధిలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌.. మాజీ మంత్రి జానారెడ్డి.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. వీరిలో ఎవరితోనూ రాములు నాయక్‌ టచ్‌లోకి వెళ్లలేదని పార్టీలోని ఒక వర్గం చెబుతోంది. కనీసం సమన్వయం చేసుకోవడానికి కూడా సంప్రదింపులు జరపకపోతే ఎలా మద్దతిస్తారని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. బలమైన నాయకులు ఉన్న జిల్లాల్లో పొరుగు ప్రాంతాల వారిని బరిలో దించడానికి గల కారణాలు చెప్పకపోవడం.. సీటు ఆశించిన వారిని బుజ్జగించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. టికెట్‌ వస్తుందన్న ఆశతో ఆర్థికంగా కొంత ఖర్చుపెట్టి ఓటర్లను నమోదు చేయించారు కొందరు కాంగ్రెస్‌ నాయకులు. వారెవరితోనూ పార్టీ పెద్దలు మాట్లాడలేదని చెబుతున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై పార్టీలో చర్చ లేదా? 

వెనక్కి తగ్గకూడదని భావిస్తున్న బెల్లయ్యనాయక్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని  అనుకుంటున్నారట. అదే జరిగితే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చూడాలి. ఇటేమో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఎన్నికల వ్యూహంపై  పార్టీలో చర్చ కూడా జరగలేదు. రాములు నాయక్‌ మాత్రం.. ఈ నియోజకవర్గంలో తన సామాజికవర్గం ఓట్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారట. బెల్లయ్య నాయక్‌ బరిలో ఉంటే మాత్రం ఓట్ల చీలిక తప్పదన్నది కొందరి అభిప్రాయం. మరి.. కాంగ్రెస్‌ పెద్దలు ఏం చేస్తారో?