సంప్రదాయాలపై సభలో హీట్..!

సంప్రదాయాలపై సభలో హీట్..!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అయితే, ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరిగింది. స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికార పక్షం సభాసాంప్రదాయాలను పాటించలేదని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తే... గతంలో మీరు కూడా పాటించలేదని అధికారపక్షం వాదించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత.. టీడీపీ నుంచి మాట్లాడిన అచ్చెన్నాయుడు... స్పీకర్ ఎన్నికకు సంబంధించి సంప్రదాయాలను పాటించ లేదని సభలో ప్రస్తావించారు. స్పీకర్ ఎన్నిక జరిపే సమయంలో టీడీపీకి కనీస సమాచారం ఇవ్వలేదన్న ఆయన.. అధికార పార్టీ సంప్రదాయాలను పాటించలేదు. అధికార పక్షం తీరు మాకు బాధ కలిగించింది. తమ్మినేనిని స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టే సమయంలో ప్రతిపక్ష నేత పేరు ప్రస్తావించకపోవడం సరికాదు. అయినా ఈ విషయాన్ని రాజకీయం చేయడం మాకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. 

ఇక అచ్చెన్నాయుడు సభలోనే కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి... గతంలో స్పీకర్ ఎన్నిక విషయంలో టీడీపీ కూడా సంప్రదాయాలను పాటించలేదని విమర్శించిన ఆయన... ప్రతిపక్షాలకు చెందిన వారు రావాలని ప్రొటెం స్పీకర్ ప్రస్తావించారు. కావాలంటే మరోసారి వినాలని సూచించారు. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ సీట్లో కూర్చొంటుంటే చంద్రబాబు రాకపోవడం ఎంత వరకు కరెక్టో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు శ్రీకాంత్ రెడ్డి. దీంతో తర్వాత మాట్లాడిన సభ్యులంతా ఈ విషయాన్ని ప్రస్తావించారు.