చిక్కుల్లో పడ్డ అలనాటి హీరోయిన్‌ భానుప్రియ

చిక్కుల్లో పడ్డ అలనాటి హీరోయిన్‌ భానుప్రియ

అలనాటి హీరోయిన్‌ భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. బాలికను పనిలో పెట్టుకుని చిత్రహింసలు పెట్టిన వివాదంలో  భానుప్రియ పైనా ఆమె సోదరుడు  గోపాలకృష్ణపైనా చెన్నై పాండీబజార్‌ పోలీసులు కేసు నమోదైంది. పద్నాలుగేళ్ల తన కూతురును పనిలో పెట్టుకున్న సినీనటి తీవ్రంగా వేధిస్తోందని, జీతం కూడా  ఇవ్వడం లేదని బాలిక తల్లి  ప్రభావతి  ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను ఇంటికి కూడా పంపడం లేదని ఆరోపించారామె. ప్రభావతి ఫిర్యాదు ఆధారంగా అప్పట్లోనే నటి భానుప్రియపై సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేశారు.

అయితే  చెన్నై పరిధిలో ఘటన జరిగినందున ఈ కేసును పాండిబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ కు బదిలీ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు.  కేసు బదిలీకి సంబంధించిన సమాచారం అందగానే భానుప్రియతోపాటు ఆమె సోదరుడిపై చెన్నైలో కేసు రిజిస్టర్‌ చేశారు. కాగా, అప్పట్లోనే తనపై వచ్చిన ఆరోపణలను నటి భానుప్రియ ఖండించింది. ఇంటిలో డబ్బు, నగలు దొంగిలించి ఎదురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చింది భానుప్రియ. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం భానుప్రియపై 323, 506,341 సెక్షన్లతో పాటు 75, 79 జువైనల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.