నాలుగు నెలల బిడ్డకు కరోనా, కానీ తల్లితండ్రులకి నెగటివ్ !

నాలుగు నెలల బిడ్డకు కరోనా, కానీ తల్లితండ్రులకి నెగటివ్ !

తూర్పు ఏజెన్సీలో 4 నెలల  పసికందుకు  కరోనా  సోకింది. అయితే తల్లిదండ్రులకు నెగిటివ్,  పసిబిడ్డకు  పాజిటివ్ రావడం, అదీ కాక చుట్టూ ఉన్న పదకొండు ఏజెన్సీ  మండలాల్లో  ఎక్కడ లేని కరోనా  పసిబిడ్డకు ఎలా వచ్చిందనే విషయం గందరగోళంకు దారి తీసింది. ఈ చిన్నారికి  కొవిడ్‌ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులకు పరీక్షలు చేస్తే నెగిటివ్‌ వచ్చింది. దీంతో బాబుకు వైరస్‌ ఎలా వచ్చిందనేది అంతుపట్టడం లేదు. రంపచోడవరం మండలం బోలగొండ పంచాయతీ పరిధిలోని చెరువూరు గ్రామానికి చెందిన దంపతులకు నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఈ నెల 20న అనారోగ్యంతో ఉన్న పసి బిడ్డను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యవసర చికిత్స కోసం రాజమండ్రి  జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరిగి కాకినాడ జనరల్‌ ఆసుపత్రికి తీసుకువచ్చి టెస్టులు జరపగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యులు ఆ బిడ్డను విశాఖలోని విమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రికి కొవిడ్‌ చికిత్స కోసం పంపించారు.

ఆ తర్వాత బిడ్డ తల్లిదండుల్రకు కరోనా పరీక్షలు  చేస్తే నెగిటివ్‌ వచ్చింది. తల్లిదండ్రులకు కరోనా  లేకున్నా బిడ్డకు ఎలా వచ్చిందనేది ఇప్పుడు వైద్యులకు చిక్కు ప్రశ్నగా మారింది. ఒకవేళ ఎవరి ద్వారా అయినా వ్యాపించిందా? అంటే ఏజెన్సీలో ఉన్న 11 మండలాల్లో ఇప్పటి వరకు అసలెవరికీ పాజిటివ్‌ నమోదు కాలేదు. దీంతో ఒకవేళ టెస్టుల్లో తప్పులుదొర్లి బిడ్డకు పాజిటివ్‌గా తేలిందా? అనే చిన్న అనుమానం వైద్యులను తొలుస్తోంది. ఇదే విషయమై  ఇక్కడి వైద్యులు విశాఖ విమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. దీంతో మరింత స్పష్టత కోసం బిడ్డకు మరోసారి  కరోనా పరీక్షలు  చేయాలని నిర్ణయించారు. దీంతో విశాఖలో విమ్స్‌ నుంచి కాకినాడకు బిడ్డ శాంపిల్స్‌ వచ్చాయి. ఫలితం మరో  రెండు రోజుల్లో  తేలనుంది. అయితే  బిడ్డకు కరోనా పాజిటివ్ రావడంపై  తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పసిబిడ్డకు  పాజిటివ్ రావడంతో  వైద్యాధికారులు  అప్రమత్తం అయ్యారు.