కరోనా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో కొలువులకు గండం..!

కరోనా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో కొలువులకు గండం..!

కరోనా మహమ్మారి ప్రభావంతో... వందలు వేలు కాదు ఏకంగా లక్షల్లో ఉద్యోగాలు ఊడనున్నాయి. ఐటీరంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో..  మైక్రోసాఫ్ట్‌, విప్రో, గూగుల్‌, యాపిల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు 20కి పైగా మల్టీనేషనల్‌ కంపెనీలు, 300కిపైగా బీపీఓ కంపెనీలు, మరికొన్ని ఐటీయేతర కంపెనీలు ఉన్నాయి. వీటిలో 6 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలున్నాయి. హైదరాబాద్‌లో కరోనా మొదటి కేసు నమోదు నుంచే ఐటీ కంపెనీల్లో గుబులు రేగింది. మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో డీఎమ్‌ఎస్‌ కంపెనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగికి కరోనా అని ఫేక్ న్యూస్ వైరల్ కావడంతో.. మైండ్ స్పేస్ అంతా అలజడి రేగింది. అప్పటి నుంచే కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌.. పూర్తిస్థాయిలో అమలు చేశాయి. లాక్‌డౌన్‌ అమలు నుంచి నేటి వరకు ప్రతీ కంపెనీ వర్క్‌ ఫ్రం హోమ్‌ కొనసాగిస్తూ వస్తున్నాయి.

అయితే, కొత్త ప్రాజెక్టులు లేక... పాత ప్రాజెక్టులు క్లియరెన్స్‌ కాక... ఐటీ కంపెనీల్లో స్తబ్ధత నెలకొంది. ఎంఎన్‌సీలు ఏదోవిధంగా నెట్టుకొచ్చినా... మోస్తరు ఐటీ కంపెనీలు మాత్రం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ముందుగా ఎక్కువ సాలరీ ఉన్న వారి ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రొవైడ్‌ చేయలేని ఐటీ కంపెనీలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఉద్యోగులకు పర్సనల్‌ ల్యాప్‌టాప్‌ ఇవ్వలేక... ఇంటర్నెట్‌ డాంగుల్‌ ప్రొవైడ్‌ చేయలేక... లాక్‌డౌన్‌తో కంపెనీలను మూసివేయాల్సి వచ్చింది. వర్క్‌ లేకపోయినా... ఉద్యోగులకు జీతాలివ్వలేక రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించాయి కొన్ని కంపెనీలు. ఈకామర్స్‌ సైట్లకు కూడా కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రొడక్షన్‌... బుకింగ్స్‌... డెలివరీస్‌ లేక కోట్ల రూపాయలు నష్టపోయాయి. టెక్నికల్‌ పరంగా ఉద్యోగులను అలాగే ఉంచినా... డెలివరీ విభాగానికి చెందిన వందలాది మందిని తొలగించాయి కొన్ని సంస్థలు. 

కర్ఫ్యూ పరిస్థితుల్లో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌కి బ్రేకులు పడటంతో... ఓలా, ఊబర్, రాపిడోతోపాటు అన్ని ఫోర్‌ వీలర్‌, టూ వీలర్‌ సంస్థల వ్యాపారాలు నిలిచిపోయాయి. దీంతో... ఆయా సంస్థలు టెక్నికల్‌ విభాగంతోపాటు... ఇతర విభాగాలకూ చెందిన 40 శాతం మంది ఉద్యోగులను తొలగించాయి. పరిస్థితి చక్కదిద్దుకుని పూర్తిస్థాయిలో రవాణా ప్రారంభమైతే.. అప్పుడు చూద్దాంలే అని ఆలోచిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 200 కంపెనీలకుపైగా సీఈఓలతో సీఐఐ సర్వే నిర్వహించింది. అనేక రంగాల్లో ఉద్యోగాల్లో కోతలు తప్పవని 120 మందికిపైగా సీఈఓలు చెప్పినట్లు సర్వే నివేదిక చెప్తోంది. అమెరికా సహా అన్ని దేశాల్లో కంపెనీలు మూతపడ్డాయని... ఇకపై భారత్‌కు కొత్త ప్రాజెక్టులు ఉండకపోవచ్చని ఐటీ కంపెనీల సీఈవోలు చెప్పినట్లు సమాచారం. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇచ్చిన పలు కంపెనీలు... ఈ పదిరోజుల్లోనే చాలా మందికి టర్మినేషన్‌ లెటర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులు లేవు కాబట్టి... మీ ప్రాజెక్ట్‌ పూర్తికాగానే సాలరీ సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని... ఇకపై మీరు మా కంపెనీ ఉద్యోగి కాదని మెయిల్‌ చేస్తున్నాయి కంపెనీలు. దీంతో, అందరిలో టెన్షన్ మొదలైంది.