"మహా" రాజకీయం.. అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

"మహా" రాజకీయం.. అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విషయంలో శివసేన అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్‌ను ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించామని గుర్తు చేసిన అమిత్‌షా.. ఫడ్నవీస్‌ను సీఎం అభ్యర్థిగా శివసేన కూడా అంగీకరించిందని తెలిపారు. అయితే, ఇప్పుడు శివసేన పెడుతోన్న డిమాండ్లు మాత్రం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.. కొత్త ప్రభుత్వంలో శివసేనకు ముఖ్యమంత్రి పదవికి హామీ ఇచ్చినట్టు వారు చేసిన వాదనను తిరస్కరించారు అమిత్‌ షా.. అంతే కాదు ఎన్నికల అనంతరం తమతో కలిసి రాలేదని మండిపడ్డారు. 

ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నేను.. ఇద్దరం చాలాసార్లు బహిరంగంగా చెప్పాం, ఈ కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని గుర్తుచేసిన షా.. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.. ఇప్పుడు వారు మాకు ఆమోదయోగ్యం కాని కొత్త డిమాండ్లతో ముందుకు వచ్చారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.. బీజేపీ పట్ల బహిరంగంగా వెళ్లిన తీరును ఖండించిన షా.. మూసివేసిన తలుపుల వెనుక ఏమి జరుగుతుందో వెల్లడించడం మా పార్టీ సంప్రదాయంలో లేదని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ.. బీజేపీ-శివసేన మిత్రపక్షాలు అధికారం కోసం గొడవకు దిగిన తర్వాత రాష్ట్రం రాజకీయ అనిశ్చితిలో పడిపోయింది. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత 50:50 అధికార భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు శివసేన పేర్కొనగా.. బీజేపీ అలాంటి వాగ్దానం చేయలేదని ఖండించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నం చేసినా.. అవి ఎటూతేలకపోవడం.. గవర్నర్ ఇచ్చిన గడువు కూడా ముగియడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.