కాసేపట్లో పరిషత్ ఓట్ల లెక్కింపు..

కాసేపట్లో పరిషత్ ఓట్ల లెక్కింపు..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. గత నెలలోనే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నా... విపక్షాల విజ్ఞప్తితో వాయిదా వేసిన ఎన్నికల సంఘం.. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తయ్యేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. సుమారు 34వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇ, జులై 3వ తేదీన ఎంపీటీసీ, జులై 4వ తేదీన జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టులో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. మరోవైపు ప్రమాణస్వీకారం చేయకుండానే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీచేసింది. కాగా, రాష్ట్రంలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,930 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 6న మొదటి దశ, మే 10న రెండో దశ, మే 14న మూడో దశ.. ఇలా మొత్తం మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.