బెదిరింపుతో దంపతుల ఆత్మహత్య, బ్లాక్ మెయిలర్ ఆస్తులు దగ్ధం

బెదిరింపుతో దంపతుల ఆత్మహత్య, బ్లాక్ మెయిలర్ ఆస్తులు దగ్ధం

కర్ణాటకలో ఒక విషాద సంఘటన వెలుగు చూసింది. ఒక మహిళతో తను సన్నిహితంగా ఉన్న ఫోటోలని ఒక పూజారి ఆమె భర్తకు పంపించడంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉండగా ఆ పూజారి ఈ ఫోటోలను తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయబోయాడు. ఆ తర్వాత ఆమె భర్తకు పంపడంతో ఆ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. 

మృతులను కౌసల్య, లోకేష్ గా గుర్తించారు. నిందితుడైన పూజారి పేరు త్యాగరాజుగా తెలిసింది. కౌసల్యతో తను సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను త్యాగరాజు లోకేష్ కి పంపాడు. లోకేష్ ఆ ఫోటోలను చూడగానే ఆ భార్యాభర్తలు ప్రాణాలు తీసుకున్నారు. రామనగర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ దంపతుల కుటుంబ సభ్యులు, బంధువులు త్యాగరాజు ఇల్లు, కారు, ట్రాక్టర్లను దగ్ధం చేశారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా వచ్చింది. ఇందులో పూజారి ఇంటి నుంచి అంతెత్తున ఎగసిపడుతున్న మంటలు, పొగ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అతని కారు, ట్రాక్టర్లకు కూడా నిప్పంటించారు. త్యాగరాజు ఆస్తిపాస్తులన్నీ బూడిదయ్యే వరకు వాళ్లు అక్కడే ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ వారు అక్కడి నుంచి కదల్లేదు. ఈ అరాచకాన్ని అరికట్టేందుకు అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.