స్వర్ణ ప్యాలెస్ నిందితులకు కోర్టు షాక్

స్వర్ణ ప్యాలెస్ నిందితులకు కోర్టు షాక్

స్వ‌ర్ణ‌ ప్యాలెస్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం కేసులో నిందితులకు హైకోర్టు షాకిచ్చింది. వారి బెయిల్ పిటిష‌న్‌ 21 వ తేదీ కి వాయిదా పడింది. ముగ్గురు నిందితుల‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌నే పిటిష‌న్ కూడా కలిపి విచారణ జరుపుతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. రెండు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న మూడో అద‌న‌పు చీఫ్ మెట్రోపాలిట‌న్ కోర్టు న్యాయ‌మూర్తి, ర‌మేష్ ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ ర‌మేష్ బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కూడా 21 వ తేదీ కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వీరు రిమాండ్‌లో కొనసాగనున్నారు.

అయితే రమేష్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు ఇప్పుడు పరారీలో ఉన్నారు. రమేష్‌ ఆచూకీ కోసం ఇప్పటికే విజయవాడ పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరి గాలింపు కొనసాగుతుండగానే డాక్టర్‌ రమేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయడం సంచలనంగా మారింది. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన రెండు వేర్వేరు విచారణ కమిటీలు తమ నివేదికలు అందజేశాయి. ఇందులో రమేష్‌ ఆస్పత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని తేలింది.