యూరప్ లో కరోనా మళ్ళీ విజృంభణ: 2 లక్షలకు పైగా కేసులు నమోదు... 

యూరప్ లో కరోనా మళ్ళీ విజృంభణ: 2 లక్షలకు పైగా కేసులు నమోదు... 

ఆసియా, అమెరికా ఖండాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయిలే అనుకునేలోగా, యూరప్ దేశాల్లో కరోనా తిరిగి విజృంభిస్తోంది.  దాదాపుగా నాలుగైదు నెలలపాటు కష్టపడి, ఆంక్షలు విధించి యూరప్ దేశాల్లో కరోనాను కట్టడి చేశారు.  తగ్గిపోయిందని భావించిన ఆయా దేశాలు ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ప్రజాజీవనానికి అనుమతించారు.  దీంతో మరలా యూరప్ ఖండంలో కరోనా ఉధృతి తిరిగి ప్రారంభమైంది.  నిన్న ఒక్కరోజు ఇటలీలో 17వేలు, ఫ్రాన్స్ లో 26వేలు, స్పెయిన్ లో 17వేలు, యూకే లో 20వేలు, జర్మనీలో 12వేలు, బెల్జియంలో 15 వేలు, స్విట్జర్లాండ్ లో 17 వేలు, రష్యాలో 17వేలు కేసులు నమోదయ్యాయి.  యూరప్ లోని మిగతా చిన్న చిన్న దేశాలు కలుపుకొని నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్ లో మళ్ళీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు మళ్ళీ ఆంక్షలు విధిస్తున్నాయి.  ముఖ్యంగా రాత్రి వేళల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.  జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.  కరోనా విషయంలో ప్రపంచదేశాలు నిర్లక్ష్యం వహించవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది.