ఏడేళ్ల గరిష్టానికి పసిడి ధర... రూ.50 వేల వైపు పరుగు..!?

ఏడేళ్ల గరిష్టానికి పసిడి ధర... రూ.50 వేల వైపు పరుగు..!?

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పసిడి ధరలు ఒక్కరోజే అమాంతంగా పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుదలతో బంగారం ధర భారీగా పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.953 పెరిగి... రూ.44, 472కి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.43,519గా ఉంది. అటు న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1682 డాలర్లకు చేరింది. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడం, కరోనా వైరస్‌ వ్యాప్తి భయాలే బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.. ఇక, అంతర్జాతీయంగా బంగారం ధర ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం ఒక్కరోజే రెండు శాతానికి పైగా పెరిగాయి. 2013 ఫిబ్రవరి తర్వాత ఎప్పుడూ చేరని స్థాయికి వెళ్లింది. బంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పది శాతానికి పైగా పెరిగిందని, ఇది త్వరలోనే 1,700 డాలర్లను దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.