రేపటి నుంచే రెండోదశ వ్యాక్సినేషన్‌.. ఇలా రిజిస్ట్రేషన్‌..

రేపటి నుంచే రెండోదశ వ్యాక్సినేషన్‌.. ఇలా రిజిస్ట్రేషన్‌..

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిలో భాగంగా రేపటినుంచి పెద్దఎత్తున డ్రైవ్ ప్రారంభించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. 60ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్ల పైవారికి.. కేంద్రం, వ్యాక్సిన్‌ అందించనుంది. ప్రైవేటు మార్కెట్‌లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని.. దీని ధర 250 రూపాయలుగా ఉంటుందని సర్క్యూలర్‌ విడుదల చేసింది. అయితే వ్యాక్సిన్ పర్మిషన్ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతించింది. ప్రైవేటు ఆసుపత్రులు నియమనిబంధనలను కచ్చితంగా పాటించాలని.. నేషనల్ కో-విన్ యాప్ ద్వారా టీకా కోసం నమోదు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 10 వేల ప్రైవేట్ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కింద గుర్తించిన 687 ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ఇవ్వనున్నారు. ఈ ఆసుపత్రులను కోవిడ్-19 ఇమ్యూనిజైషన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకా ఒక డోసుకు రూ.250 ఛార్జ్ వసూలు చేయాలని.. పరిమితిని దాటకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఇక, తెలంగాణలోనూ రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు... తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కోవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ సంఖ్య ద్వారా cowin.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కోవిడ్‌ టీకా తీసుకోవచ్చన్నారు. అటు ఏపీలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం అనుమతించిన ప్రైవేటు ఆస్పత్రుల్లోటీకా వేయనున్నారు.