'చంద్రబాబు, జగన్ ఏకం కావాలి..!'

'చంద్రబాబు, జగన్ ఏకం కావాలి..!'

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరం అన్నారు. దీని కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక మే 23వ తేదీ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి మిగిలేది మూడు నామాలేనని ఎద్దేవా చేసిన నారాయణ... గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. నెలకు మేకప్‌ కోసం రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్న మోడీ చాయ్ వాలానా? అంటూ ప్రశ్నించారు నారాయణ. సీబీఐ, ఆర్బీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం  చేశారు. 

ఎన్నికల కౌంటింగ్ తర్వాత నరేంద్ర మోడీ ఇక సినిమాల్లో నటించాల్సిందేనని ఎద్దేవా చేశారు నారాయణ... ప్రస్తుత ఎన్నికల విధానం లోపభూయిష్టంగా సాగుతోందని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ సర్కారు హత్యలేనని విమర్శించిన నారాయణ.. విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంగా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.