సింగరేణిలో మళ్లీ పట్టు సాధించేందుకు సీపీఐ ప్లాన్‌!

సింగరేణిలో మళ్లీ పట్టు సాధించేందుకు సీపీఐ ప్లాన్‌!

కమ్యూనిస్ట్‌లకు కార్మికులే అండ. కొన్నాళ్లుగా ఆ వర్గానికి దూరం అవుతున్నామన్న ఫీలింగో ఏమో.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని చూస్తున్నారు కామ్రేడ్లు. ఇందుకోసం సింగరేణి నుంచి ఆపరేషన్‌ మొదలుపెట్టారు. నల్లబంగారంలో ఎర్ర పాచికలు వేస్తున్నారు. 

సింగరేణిలో పాగాకు సీపీఐ ప్లాన్‌!

తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సింగరేణి విస్తరించింది.  మొత్తం 11 యూనిట్లు. ఒకప్పుడు ఈ 11 యూనిట్లలో ఎర్రజెండాలు ఎగిరేవి. లెఫ్ట్‌ అనుబంధ సంస్థల్లోనే కార్మికులు సభ్యులుగా ఉండేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గడిచిన రెండు పర్యాయాలుగా టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘానిదే రాజ్యం. సీపీఐ అనుబంధ AITUCకి ఎదురుగాలి వీస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకోవడంతో మళ్లీ పాగా వేయడానికి సరికొత్త పాచికలను సిద్ధం చేస్తోంది CPI. 

కూనంనేనిపై ఏఐటీయూసీ గెలుపు బాధ్యతలు!

సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తే..ఆ ప్రభావం సాధారణ ఎన్నికల్లోనూ కనిపిస్తుందన్నది పార్టీల అభిప్రాయం. గతంలో 11 డివిజన్లలో 9 చోట్ల టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం విజయం సాధించింది. ఆ సంఘానికి ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలు. AITUC కేవలం రెండుచోట్లే సత్తా చాటిన పరిస్థితి. ఈ దఫా సింగరేణిలో పూర్వ వైభవం సాధించేందుకు.. నల్లబంగారు గనుల్లో AITUCని బలోపేతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించింది సీపీఐ. ఆ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆయన పని కూడా మొదలు పెట్టేశారు. 

కోల్‌బెల్ట్‌లో సెగలు పుట్టిస్తున్న ఎన్నికలు!

ఎండాకాలానికి తోడు సింగరేణి బెల్ట్‌లో ప్రస్తుతం ఎన్నికల వేడి కూడా సెగలు రేపుతోంది. కార్మికుల సమస్యలు.. వారసులకు ఉద్యోగాలు ఇలా చాలా అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరిస్తారన్న ప్రచారం పీక్‌లో ఉంది. గతంలో ఒక లక్షా 40 వేల మంది కార్మికులు పనిచేసిన చోట.. ఇప్పుడు 40 వేల మందే పనిచేస్తున్నారు. వీటిన్నింటిపైనా కార్మిక సంఘాల మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలన్నది AITUC వ్యూహంగా కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాన్ని బలంగా ఢీకొడతారా? 

తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన TRS, CPIలకు సింగరేణిలో కుస్తీపట్లు తప్పడం లేదు. సాధారణ ఎన్నికల్లో కుదురుతున్న దోస్తీ ఇక్కడ మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ దఫా మాత్రం కార్మిక లోకంలో మళ్లీ పట్టు సాధించకపోతే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలో కామ్రేడ్లు ఉన్నారట. అందుకే TRS అనుబంధ సంఘాన్ని బలంగా ఢీకొట్టేలా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు.. గుణపాఠాలను రిపీట్‌ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారట. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ అనుబంధం సంఘం కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది. దీంతో కోల్‌బెల్ట్‌ పాలిటిక్స్‌ జనరల్‌ ఎలక్షన్స్‌ను మించి సాగుతున్నాయని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. నల్లబంగారు నేలలో ఎర్ర పాచికలు ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.