ఈసారి ఎవరూ ఊహించని ఫలితాలు..!

ఈసారి ఎవరూ ఊహించని ఫలితాలు..!

ఎవరూ ఊహించని రీతిలో 2004 ఎన్నికల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధాని అయినట్టుగానే.. 2019 ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితే రానుందన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. లౌకిక శక్తులన్నీ ఏకమై కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఏచూరి... అయితే, 1998లో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన “యునైటెడ్ ఫ్రంట్ “ తరహా ప్రభుత్వం కానీ, లేదా 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యూపీఏ తరహా ప్రభుత్వం కానీ ఏర్పడేందుకే ఎక్కువ అవకాశాలున్నాయన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌తో సమావేశమయ్యారన్నారు సీతారాం ఏచూరి. కూటముల ఏర్పాటు అనేది ఫలితాల తర్వాతే అనే విషయాన్ని కేసీఆర్‌కు స్పష్టం చేశామని తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే సమష్టిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లో మా ఓటును మేం వేసుకునే పరిస్థితులుంటే మా బలం గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు ఏచూరి.. కానీ, పోలింగ్ బూతులను పెద్ద సంఖ్యలో కబ్జాచేసి త్రిణమూల్ కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు, హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి చర్యలకే సీపీఎం పాల్పడిఉంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదన్నారు. 2004లో 35 ఎంపీలతో బలంగా ఉన్న వామపక్షాలు... 2014 నాటికి కేవలం రెండు స్థానాలకు పడిపోయాయి... కానీ, మా బలం ఇప్పుడు గణనీయంగా పెరగనుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడే వామపక్షాల ప్రభావం ప్రభుత్వాలపై బలంగా ఉంటుందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కూడా మా పాత్ర కీలకం కానుందన్నారు సీతారాం ఏచూరి.