కరోనాపై పోరుకు విరాళం ప్రకటించిన మిథాలీ రాజ్..!

కరోనాపై పోరుకు విరాళం ప్రకటించిన మిథాలీ రాజ్..!

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దేశం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. ఇలాంటి సమయంలో పలువురు ప్రముఖులు కరొనపై పోరుకు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. సినీ, క్రీడా రంగాల నుండి ఇప్పటికే కొందరు తమ వంతు విరాళం ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆ జాబితాలో భారత మహిళల వన్ డే టీం కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా చేరారు. కరోనా పై పోరుకు తన వంతుగా 10 లక్షల విరాళం ప్రకటించి గొప్ప మనసును చాటుకుంది. ఈ మొత్తంలో నుండి ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు , తెలంగాణ రాష్ట్ర సహాయ నిధికి 5 లక్షలు ఇస్తున్నట్టు ఆమె పేర్కొంది. "‘ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరాటంలో మనమంతా చేతులు కలపాలి. నా వంతు చిన్న సాయంగా పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 5 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 లక్షలు ఇస్తున్నా" అని మిథాలీ రాజ్ ట్వీట్  చేసింది. క్రికెట్ లో పురుషుల ఆదాయం తో పోలిస్తే మహిళా క్రికెటర్ ల ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అయినా మిథాలీ పెద్ద మొత్తంలో సహాయం ప్రకటించడం గొప్ప విషయమే చెప్పాలి.