ఇంకా తగ్గిన క్రూడ్‌ ధరలు

ఇంకా తగ్గిన క్రూడ్‌ ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. దేశీయంగా మన మార్కెట్‌లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం అదే స్థాయిలో తగ్గించడం లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో చేరిన గరిష్ఠ స్థాయితో పోలిస్తే ముడి చమురు ధరలు దాదాపు 36 శాతం తగ్గాయి. మరోవైపు ఇటీవల రూపాయి బలపడినా.. ఆ ఫలితం మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుదారులకు లభించడం లేదు. గత వారం భారీగా క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 54 డాలర్లకు చేరగా, అమెరికా మార్కెట్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర 45.46 డాలర్లకు పడిపోయింది. 

సరఫరాపై ప్రభావం
క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడంతో సరఫరాపై ప్రభావం చూపే అవకాశముంది. ప్రస్తుత శీతాకాలంలో డిమాండ్‌ తక్కువగా ఉండటం, సరఫరాలో కోత జనవరి నుంచి అమల్లోకి వస్తున్నందున... ఇపుడు సరఫరా సమృద్ధిగానే ఉంది. అయితే ముడి చమురు బ్యారెల్‌ ధర 50 డాలర్ల దిగువకు రావడంతో షేల్‌ క్రూడ్‌ ఆయిల్‌ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరకు తాము చమురు అందించలేమని అంటున్నారు. షేల్‌ బావుల నుంచి చమురు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటుంది. సముద్రబావుల నుంచి తీసే చమురు ధరలు తక్కువగా ఉంటాయి, పైగా చాలా బావులు ప్రభుత్వాల చేతిలో ఉన్నందున.. వాటిపై పన్నుల భారం తక్కువే. దీంతో షేల్‌ గ్యాస్‌ ఉత్పత్తిదారులు వచ్చే ఏడాది ఆరంభం నుంచి సరఫరాను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.