'చంద్రగిరి రీపోలింగ్' పై స్పందించిన సీఎస్ ఎల్వీ

'చంద్రగిరి రీపోలింగ్' పై స్పందించిన సీఎస్ ఎల్వీ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ వ్యవహారం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ అంశంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. చంద్రగిరిలోని ఏడు గ్రామల్లోని ఎస్సీలు ఓటు హక్కు వినియోగించుకోలేదని ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదులో ఉన్న తీవ్రతను బట్టి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడం అధికారులుగా మా బాధ్యత అని తెలిపారు. ఫిర్యాదుపై సాక్ష్యాలను పరిశీలించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రీపోలింగ్ విషయంలో నన్ను, ఇతర అధికారులను తప్పు పట్టడం సరికాదని అన్నారు. పాలనను గుడ్డిగా సాగే పరిస్థితి రానివ్వనని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సూచనల మేరకే సీఈఓ ద్వివేది రీ-పోలింగుకు సిఫార్సు చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నెల ఆరో తేదీన రీ-పోలింగ్ చేయాలంటూ సీఎస్ ఎల్వీని చెవిరెడ్డి కోరారు. చెవిరెడ్డి ఫిర్యాదు పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ కోరుకుంటున్నారంటూ ద్వివేదికి సీఎస్ ఓఎస్డీ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యం స్పష్టంగా కన్పిస్తోంది. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీ-పోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఈవోకు ఫిర్యాదు చేయకుండా సీఎస్ వద్దకు చెవిరెడ్డి ఎందుకెళ్లారని టీడీపీ ప్రశ్నిస్తోంది. తనకు సంబంధం లేని వ్యవహారంలో సీఎస్ జోక్యం ఎందుకు? అని టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.