ధోనీ అదే స్థానంలో వస్తాడు: ఫ్లెమింగ్‌

ధోనీ అదే స్థానంలో వస్తాడు: ఫ్లెమింగ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ -12 మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. మ్యాచ్‌లకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని టీముల ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగితేలుతున్నారు. చెన్నై ఆటగాళ్లు సీఎస్‌కే హెడ్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సారథ్యంలో ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఫ్లెమింగ్‌ మాట్లాడా రు.

'గత ఐపీఎల్‌లో సీజన్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ధోనీ ఎన్నో విజయాలను అందించారు. ఈ సీజన్‌లో కూడా ధోనీ అదే స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడని తెలిపారు. సీజన్‌-11లో కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా మిడిలార్డర్‌ బాధ్యత ధోనీపై పడింది. జాదవ్‌ తిరిగి జట్టులోకి రావడంతో మిడిలార్డర్‌ పటిష్టం అయింది. అయితే మ్యాచ్‌ పరిస్థితుల దృష్ట్యా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయి. జాదవ్‌, ధోనీలు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలరని' ఫ్లెమింగ్‌ చెప్పుకోచ్చారు.

'ఓ జట్టును మరో జట్టుతో పోల్చడం సరికాదు. ప్రస్తుతం సీఎస్‌కే పటిష్టంగా ఉంది. రైనా, ధోనీ, బ్రేవో, డుప్లెసిస్‌, వాట్సన్‌, జాదవ్‌, విజయ్, బిల్లింగ్స్, రాయుడులతో బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉంది. జడేజా, హర్భజన్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, తాహీర్‌, సాంట్నర్‌లతో స్పిన్‌ విభాగం.. దీపక్, మోహిత్, డ్వేన్‌ బ్రేవో, వాట్సన్‌లతో పేస్ కూడా బాగుంది. ఇప్పటికే సీఎస్‌కే వ్యూహాలను రచించిందని' ఫ్లేమింగ్‌ తెలిపాడు.