ఎన్‌కౌంటర్: రాళ్లు, కర్రలతో దాడికి దిగారు...

ఎన్‌కౌంటర్: రాళ్లు, కర్రలతో దాడికి దిగారు...

దిశ కేసులో నిందితులగా ఉన్న ఆ నలుగురి ఎన్‌కౌంటర్‌పై ఘటనా స్థలంలోనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో మొదట ఎలాంటి క్లూ లభించకుండా విచారణ ప్రారంభించామని.. అనేక కోణాల్లో కేసును విచారించి.. శాస్త్రీయ ఆధారలతోనే నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నరేష్‌, చింతకుంట చెన్నకేశవులను అరెస్ట్ చేసి.. నవంబర్ 30వ తేదీన షాద్‌నగర్ పీఎస్‌లోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాం.. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. అనంతరం కేసులో లోతైన విచారణ కోసం పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ ఇచ్చారని తెలిపారు. 4వ తేదీన చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామన్నారు. విచారణలో వాళ్లు చాలా విషయాలు చెప్పారని తెలిపిన సీపీ సజ్జనార్.. బాధితురాలిని దహనం చేసిన ప్రాంతంలో ఫోన్ దాచిపెట్టామని చెబితే.. తెల్లవారుజామున నిందితులను తీసుకొచ్చామన్నారు. అయితే, ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాం.. అక్కడ పెట్టాం అంటూ.. నలుగురు నిందితులు కాసేపు సమయం వృథా చేసి.. అనంతరం పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేయడం మొదలుపెట్టారని.. ఆ తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు... పోలీసుల నుంచి వెపన్స్ లాక్కుని కాల్పులకు ప్రయత్నించారని వివరించారు.. అయితే.. లొంగిపోవాల్సిందిగా నిందితులను హెచ్చరించానా వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయని.. తర్వాత వెళ్లి చూస్తే నలుగురు చనిపోయి ఉన్నారని చెప్పుకొచ్చారు సీపీ సజ్జనార్. ఆ నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చినప్పుడు 10 మంది పోలీసులు ఉన్నారని.. వీరిలో ఓ ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలైనట్టు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది జాతీయ మానవహక్కుల కమిషన్.