రవిప్రకాశ్ కేసులో కీలక మలుపు..

రవిప్రకాశ్ కేసులో కీలక మలుపు..

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులకు బలమైన సాక్ష్యాలు లభించాయి. రవి ప్రకాశ్ తరపు అడ్వకేట్ జే. కనకరాజు ఇంట్లో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో తమకు కీలక ఆధారాలు దొరికాయని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అలాగే యాజమాన్య మార్పుకు సంబంధించిన కీలకమైన ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో రవి ప్రకాశ్‌కు ఆయన సహకరించారని పోలీసులు అభియోగం మోపారు.

నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు శివాజీ, మాజీ సీఎఫ్‌వో మూర్తికి కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు సీజ్‌ చేసిన విషయం విదితమే.