అతి తీవ్ర తుఫానుగా వాయు!!

అతి తీవ్ర తుఫానుగా వాయు!!

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో వచ్చిన సైక్లోన్ వాయు జూన్ 13న గుజరాత్ తీరం చేరుతుందని భావిస్తున్నారు. రాగల 24 గంటల్లో ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చవచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను సౌరాష్ట్ర, కచ్ దిశగా దూసుకొస్తోంది. పరిస్థితి తీవ్రంగా ఉండనున్నట్టు ఐఎండీ తెలిపింది. ఇది అతి తీవ్ర తుఫానుగా మారిందని ప్రకటించింది. గురువారం ఉదయం గంటలకు 145-170 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. 

సైక్లోన్ వాయు తీరాన్ని చేరడానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో ప్రచండ వేగంతో ఈదురు గాలులు, గాలి దుమారం రేగుతున్నాయి. సుప్రసిద్ధ సోమనాథ దేవాలయం దగ్గర దుమ్ముధూళితో కూడిన తుఫాను గాలులు వీచాయి.

సైక్లోన్ వాయు ప్రభావంతో జూన్ 12, 13న సముద్రంలో ఉవ్వెత్తున అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయి. కొంకణ్ ప్రాంతంలోని పాల్ఘర్, ఠాణే, ముంబై, రాయగఢ్, రత్నగిరి, సింధ్ దుర్గ్ లలోని అన్ని సముద్ర తీరప్రాంతాలను రాబోయే రెండు రోజులు మూసేయవచ్చు.

ఈ తుఫాను ప్రభావం మహారాష్ట్రలోనూ కనిపించడం మొదలైంది. ముంబైలో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. కొన్ని తీరప్రాంతాలలో కూడా ఉదయం నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. 

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీరప్రాంతాలు, దక్షిణ గుజరాత్ లలో హై అలర్ట్ ప్రకటించింది. తీరప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. సైన్యాన్ని కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సన్నాహాలు చేస్తోంది. సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.