దగ్గుపాటి కుటుంబం నుంచి మరో ప్రొడక్షన్ హౌస్
ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్‌లు కూడా ప్రాముఖ్యత పొందుతున్నాయి. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు వినూత్న కాంసెప్ట్లతో, కథలతో తెరకెక్కుతున్నాయి. వీటిలో అగ్ర సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్లు కూడా మొగ్గు చూపుతున్నాయి. మంచి కథ ఉంటే పెట్టుబడి పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నాయి. అయితే ఇటీవల తెలుగు సినీ వర్గాల్లో ఓ ప్రశ్న వినిపిస్తోంది. మన తెలుగు దర్శకులు ఎందుకు వెబ్‌సిరీస్‌లలో వస్తున్నటువంటి కథలు తీసుకురారు, వారికి ఈ కథలు ఎందుకు నచ్చడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై తెలుగు చిత్ర సీమ ప్రధాన హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రానా స్పందించాడు. దీనికి చెక్ పెట్టేందుకు ఓ ప్రొడక్షన్ హౌస్‌ను సిద్దం చేస్తున్నాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్‌ను వెబ్ సిరీస్‌లోకి కూడా తీసుకువెళ్లనున్నాడు. దగ్గుపాటి ఫిలింస్ అనే పేరుతో మరో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నాడు. దీని ద్వారా యంగ్ టాలెంట్లను ప్రోత్సహించనున్నాడు. కొన్ని టీమ్‌లను సిద్దం చేసి మంచి కథలు రాసే విధంగా ప్రేరేపిస్తారు. వారు రాసిన కథలో కావలసిన మార్పులను చెప్పి మంచి కథ సిద్దం అయితే మొదట నెట్‌ఫ్లిక్స్‌లో తరువాత అమెజాన్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కాన్సెప్ట్‌లు కేవలం తెలుగులో మాత్రమే రాయబడతాయి. మంచి ఆదరణ పొందాక దానిని ఇతర భాషల్లోకి అనువాదం చేస్తారని చెప్పారు. ఇప్పటికే రానా కొన్ని టీమ్‌లను ఏర్పాటు చేసి వారి ఆలోచనలను, కాన్సెప్ట్‌లను చూస్తున్నారు. అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్ వారు కూడా నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. మరి ప్రొడక్షన్లోకి రానా వచ్చాక ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)