తండ్రికి తగ్గ తనయుడు... దగ్గుబాటి సురేశ్ బాబు

తండ్రికి తగ్గ తనయుడు... దగ్గుబాటి సురేశ్ బాబు

తండ్రి చూపిన బాటలోనే తనయులు పయనించడం విశేషమేమీ కాదు. అయితే తండ్రికి తగ్గ తనయులుగా పేరు సంపాదించడమే అసలు విశేషంగా మారుతుంది. తెలుగు చిత్రసీమలో అలాంటి పేరు సంపాదించిన వారిలో ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ప్రత్యేక స్థానంలో నిలచే ఉంటారు. ఆయన తండ్రి డి.రామానాయుడు నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తండ్రి చాటున బిడ్డగా ఉంటూనే చిత్రనిర్మాణంలోని మెలకువలు అభ్యసించిన సురేశ్ బాబు 1990లో 'బొబ్బిలిరాజా'తో నిర్మాతగా మారారు. అప్పటి నుంచీ తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు పలు చిత్రాలు నిర్మించారు.  తన తమ్ముడు వెంకటేశ్ ను టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా నిలపడం కోసం సురేశ్ బాబు చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరు. ఇక నిర్మాతగా తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనం చొప్పించడానికి సురేశ్ బాబు సదా ప్రయత్నించేవారు. 

నేనున్నానంటూ ... ముందడుగు...
తెలుగులోనే కాదు, దక్షిణాదిన ఎందరో ప్రముఖ నిర్మాతల తనయులు తండ్రుల బాటలోనే పయనిస్తూ నిర్మాతలయ్యారు. అయితే సురేశ్ బాబు మాత్రం కాలానికి అనుగుణంగా సాగుతూ చిత్రనిర్మాణం సాగించారు. అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. తండ్రి తనకు ఆస్తిగా ఇచ్చిన నిర్మాణసంస్థ, స్టూడియోస్, పంపిణీ సంస్థ, పబ్లిసిటీ సంస్థ వంటి వాటిని ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. ముఖ్యంగా తెలుగునాట థియేటర్లను లీజుకు తీసుకొని మూతపడిపోనున్న ఎన్నో సినిమా హాళ్ళకు ఆ దుస్థితి పట్టకుండా కాపాడిన ఘనత సురేశ్ బాబుదే అని చెప్పవచ్చు. ఇక క్రేజీ కాంబినేషన్స్ లో రూపొందే చిత్రాలకు భాగస్వామిగానూ ఉంటున్నారు సురేశ్ బాబు. ఈ మధ్య మునుపటిలా వేగంగా చిత్రనిర్మాణం సాగించడం లేదు. అయినా తెలుగు సినిమా పరిశ్రమలో  ఎలాంటి సమస్యలు  తలెత్తినా నేనున్నాంటూ ముందడుగు వేస్తుంటారు సురేశ్ బాబు. 

సురేశ్ బాబు  తనయుడు రానా నవతరం నాయకునిగా సాగిపోతున్నారు. రానా సైతం తండ్రి బాటలో పయనిస్తూ కొంతకాలం గ్రాఫిక్స్ నిర్వహించారు. తరువాత బాబాయ్ వెంకటేశ్ ను ఆదర్శంగా తీసుకొని నటనలో అడుగుపెట్టారు. సురేశ్ బాబు నిర్వహణలోనే రామానాయుడు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ సాగుతోంది. అందులో శిక్షణ పొందిన వారికి తమ చిత్రాల ద్వారా అవకాశాలూ కల్పిస్తున్నారు. కరోనా కల్లోలంలో సతమతమై పోయిన తెలుగు సినిమాను మళ్ళీ మునుపటి స్థితికి తీసుకురావడానికి ఎందరో నడుం బిగించారు. వారిలో ముందు వరుసలో ఉన్నారు సురేశ్ బాబు.