మరో రికార్డుకు చేరువలో 'స్టెయిన్‌'

మరో రికార్డుకు చేరువలో 'స్టెయిన్‌'

ఫాస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించే దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ నేడు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. 2004లో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేసిన స్టెయిన్‌ అతికొద్ది సమయంలోనే వన్డే, టీ-20లలో చోటు సంపాదించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. స్టెయిన్‌ తన 14 సంవత్సరాల క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే ఈ మధ్య కాలంలో వరుస గాయాలతో ప్రొటీస్ జట్టుకు దూరమయ్యాడు.

తన క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన స్టెయిన్‌ మరో మూడు టెస్టు వికెట్లు సాధిస్తే దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఇంతకుముందు దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు(421) సాధించిన రికార్డు షాన్‌ పొలాక్‌ పేరిట ఉంది. జులై 12న శ్రీలంకతో  జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో స్టెయిన్‌ ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. 'నా టార్గెట్‌ 100 టెస్టులు, 500 వికెట్లు, 2019 ప్రపంచకప్‌' అని శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన అనంతరం స్టెయిన్‌ తెలిపాడు. వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యంను చేరుకునే వరకు క్రికెట్‌ ఆడుతానని స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ స్పష్టం చేసాడు.

గత జనవరి దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో కాలి మడమకు గాయం అవడంతో జట్టుకు దూరామయ్యడు. గాయం నుండి కోలుకుని ఇంగ్లాండ్ కౌంటీల్లో యార్క్ షైర్ పై స్టెయిన్‌ అద్భుత ప్రదర్శన చేసాడు. మొదటి ఇన్నింగ్స్ లో స్టెయిన్‌ 66 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసాడు. మొదటి వికెట్ గా భారత టెస్ట్ బ్యాట్స్ మెన్ పుజారా వికెట్ తీసిన విధానం మాత్రం అద్భుతం. ఈ తాజా ప్రదర్శనతో.. జాగ్రత్తగా ఉండమని శ్రీలంక జట్టుకి బలమైన సంకేతాలు పంపాడు.