కారులో దానం సీటేది.?

కారులో దానం సీటేది.?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ  తెలంగాణలో  రాజకీయ వేడీ రాజుకుంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ , కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ముందుస్తు ఎన్నికలకు సైతం సై అంటున్నాయి. గులాబీ బాస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. అందులో బాగంగానే కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దానం నాగేందర్ ని కారెక్కించుకున్నారు. అయితే.... ఆ కారులో ఏ సీటు ఇవ్వాలి అనేది ఇప్పుడు తర్జన భర్జన. ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కొందరు, ఎంపీగా పంపుతారని కొందరు , పార్టీ పదవికే పరిమితం చేస్తారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఆయనకు ఎలాంటి స్థానం కల్పించబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో నాగేందర్‌కు ఏ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే కేసీఆర్‌ చాలా వ్యూహాత్మకంగానే దానంను పార్టీలోకి తీసుకున్నారు. మంచి కేడర్ ఉన్న లీడర్. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా ... గుడ్డిగా ఆయనతో పాటు నడిచే కార్యకర్తలు భారీగానే ఉన్నారు. నిజానికి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ పార్టీకి బ‌ల‌మైన అభ్యర్థి లేరు. ఇక్కడ బీజేపీని ఢీకొట్టడం అంత సులువు కాదు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ ఎంపీగా కొన‌సాగుతున్నారు. సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ పక్కాప్లాన్ తో అడుగులు వేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి దానం నాగేంద‌ర్‌ను పార్టీలోకి తీసుకుని సికింద్రాబాద్ నుంచి బ‌రిలోకి దించాల‌న్నది కేసీఆర్  వ్యూహమని స‌మాచారం.

మొదట్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి త‌ల‌సానిని బ‌రిలోకి దించాల‌ని భావించిన‌ట్లు తెలిసింది. అయితే.. ఆయన సుముఖంగా లేక‌పోవ‌డంతో గులాబీ బాస్ దానం చేరికకు సమ్మతించారని తెలుస్తోంది. మరోవైపు... బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన దానం నాగేంద‌ర్‌ను ఎంపీగా బ‌రిలోకి దించి, ఎలాగైనా బీజేపీని ఓడించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో గులాబీ బాస్ ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి వైఎస్ హ‌యాంలో కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేసిన దానం... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఓటమి చవిచూశారు. అనంతరం గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్యక్షప‌ద‌వి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పార్టీలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు  సీటు ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది. 

ఎవరెన్ని చెప్పినా....  ఖైరతాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచే తాను పోటీ చేస్తానంటూ దానం ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి గులాబీ బాస్ కూడా ఓకే చెప్పారని అనుచరులతో చెబుతున్నారు. ఇప్పటికే  ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ దివంగత జనార్థన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డిలు కూడా టికెట్టును ఆశిస్తున్నారు. అటు... మైనారిటీతోపాటు బీసీ ఓటర్లను ఆకట్టుకునే నాయకుడి కోసం టీఆర్ఎస్ చూస్తున్న సమయంలో దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌‌లో చేరడంతో ఆయనకు గ్రేటర్‌ పదవి అప్పగిస్తారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గ్రేటర్‌ అధ్యక్షుడిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు బలమైననాయకుడు. ఆయనను కాదని నాగేందర్‌కు ఆ పదవి ఇవ్వక పోవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా.... వ‌చ్చే ఎన్నిక‌ల్లో దానం నాగేందర్ కు కారులో ఏ సీటు ఇస్తారు అన్నది స్పష్టత లేదు. దీంతో ఆయన కేడర్ లో ఉత్కంఠ నెలకొంది. మ‌రి దానం ఏం చేస్తారో ఎలా అడుగులు వేస్తారో చూడాలి.