తెలంగాణ ఆర్టీసికి డేంజర్ బెల్స్ ?

తెలంగాణ ఆర్టీసికి డేంజర్ బెల్స్ ?

ప్రజారవాణా వ్యవస్థలో సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించింది. భవిష్యత్తులో పెరిగే వాహనాల రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా ప్రజారవాణాను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తదనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించే దిశగా అధ్యయనం ఆరంభించింది. ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సు రూట్లపై ఆర్టీసీలకు ఉన్న అధికారాలకు కోత పెట్టింది. విదేశాల్లో అమలులో ఉన్న ప్రజారవాణా వ్యవస్థను భారతదేశంలోనూ ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. కొత్త విధానం అమలుకు, రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో నితిన్‌ గడ్కరీ త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. 

2030 నాటికి నగరాల్లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాల వాహనాల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరగనుంది. దీనికి పరిష్కారంగా ఇప్పటినుంచే ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రపంచ బ్యాంకు కేంద్రానికి సూచనలు చేసింది. రాష్ట్రాల వారీగా ఆర్టీసీలు నడిపిస్తున్న బస్సులు.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వీటి సంఖ్య తదితర అంశాలపై కేంద్ర రవాణాశాఖ, ప్రపంచబ్యాంకు బృందం అధ్యయనం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు టైర్‌-1లో 80లక్షలు ఆపైన, టైర్‌-2లో 40 నుంచి 80లక్షలు, టైర్‌-3లో 10-40 లక్షలు, టైర్‌-4లో 5 నుంచి10లక్షల జనాభాగల నగరాలను చేర్చారు. రవాణా అధికారుల లెక్కల ప్రకారం లక్ష జనాభాకు 50 బస్సులు అవసరం. ప్రస్తుతం మాత్రం 18 బస్సులే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రహదారుల విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా.. లక్ష మంది జనాభాకు బస్సుల సంఖ్య ముందు 30కి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కొత్త విధానానికి ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు రూట్‌ పర్మిట్లు ఇచ్చే విషయమై రాష్ట్రాలతో చర్చించనుంది. అయితే ఈ పరిణామాలు తెలంగాణ ఆర్టీసీలో ఆందోళనను పెంచుతున్నాయి.